మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పై మంచి స్పందన కనిపిస్తోంది. కర్ణాటక, తెలగాణలోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో, ఏపీలోనూ మహిళల్లో ఈ ఉచిత బస్సు ప్రయాణం పైన చర్చ మొదలైంది. ఏపీలో మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే వివిధ రాష్ట్రాల్లోని ప్రజల నుంచి దీనిపై వస్తున్న స్పందన చూస్తున్న ఏపీ ప్రభుత్వం అమలుకు ప్రయత్నాలు ప్రారంభించిందట.
వీలైతే దీన్ని వచ్చే సంక్రాంతి నుంచి అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారులు రహస్యంగా అధ్యయనం చేస్తున్నారని టాక్ నడుస్తోంది. వివిధ రాష్ట్రాల్లో ఈ పథకం ఎలా అమలు అవుతుంది. ఏ ఏ బస్సుల్లో ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. దీని వల్ల ప్రజల ఏమనుకుంటున్నారు. ఆర్టీసీకి ఎంత నష్టం వస్తుంది. ఆ లోటు పూడ్చటానికి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి. ఇలా అన్నింటిపై సర్వే చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వాళ్లు ఎందరు. వారిలో మహిళలు ఎంతమంది ఉంటారు. విద్యార్థులు ఎంతమంది ఉంటారు ఇలా అన్ని వివరాలను అధికారులు తీసుకుంటున్నారు. ఒక వేళ మహిళలకు ఉచిత ప్రయాణలు స్కీం అమలు చేస్తే ఆర్టీసీకి భారీగా ఆదాయం పడిపోనుందని…దాన్ని ప్రభుత్వం ఎలా భర్తీ చేయనుందో కూడా లెక్కలు వేస్తున్నారు.