ఏకాదశి చాలా పరమ పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని పూజించటం వల్ల పుణ్యం లభిస్తుంది. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును దర్శించడానికి ప్రజలందరూ దేవాలయాలకు వెళ్తూ ఉంటారు. ఇలా మహావిష్ణువును దర్శించి పూజించటం వల్ల సకల కష్టాలు తొలగిపోతాయని ప్రజల నమ్మకం. అయితే మన దేశంలో ఆధ్యాత్మికతకు, ఆరోగ్యానికి సన్నిహిత సంబంధం ఉన్నది. ముక్కోటి ఏకాదశి రోజున ముఖ్యమైనవి ఉపవాసం, జాగరణ. అటు తర్వాత జపం, ధ్యానం. జ్యోతిష్యం ప్రకారం చంద్రగమనాన్ని అనుసరించి 120 డిగ్రీల నుండి 132 డిగ్రీల వరకు ఉన్న చంద్రగతి ఏకాదశి తిధి.
ఆ రోజు చంద్రుడు,సూర్యుడు,భూమి మధ్య ఉండే దూరము,సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు మన జీర్ణక్రియ మీద ప్రభావం చూపుతాయని, అరుగుదల మందగిస్తుందని, అందువల్ల ప్రతి ఏకాదశి నాడు ఉపవసించాలని జ్యోతిష్యం తెలియపరుస్తోంది. ఈ విషయంలో వైజ్ఞానిక శాస్త్రం కూడా ఇదే చెప్తోంది. మనం తినే ఆహారం మొత్తం జీర్ణం కాదు. మన శరీరంలో కొంత భాగం మిగిలిపోతుంది. అది మురిగిపోయి రోగాలకు కారణమవుతుంది. ఇది విషపదార్ధం. ఈనాటి శాస్త్రం దీనిని toxins అంటుంది. వీటివల్లనే మనిషికి 90% రోగాలు వస్తున్నాయి. ఈ toxins ను ఆయుర్వేదంలో ఆమం అంటారు, దాని వలన కలిగే రోగాలను ఆమ రోగాలంటారు.
ప్రతి 12 రోజులకొకసారి చేసే ఈ ఉపవాస సమయంలో మన శరీరంలో ఉన్న విషాలు బయటకుపోయి శరీరం శుభ్రపడుతుంది. అందువల్ల మనిషికి దీర్ఘకాలంలో రోగాలు రాకుండా ఉంటాయి. చిన్న వయసు నుంచి ఏకాదశి వ్రతం చేస్తున్న వారు 70ఏళ్ళ వయసులో కూడా యువకుల్లాగా ఉత్సాహంగా ఉండడం మనం గమనించవచ్చు. ఎటువంటి మోకాళ్ళ నొప్పులు వీరిని బాధించకపోవడం ప్రత్యక్షంగా కనపడుతోంది. అందుకని ఏకాదశి తిధి నాడు ఉపవసించాలని ఆయుర్వేదం చెప్తోంది. ప్రధాన పర్వదినాల్లో వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి చాలా ప్రముఖమైనది.
వైకుంఠ ఏకాదశి నాడు భారతీయులు పాటించే నియమ నిష్ఠలు అటు ఆధ్యాత్మికత చింతనను పెంపొందించడమే కాకుండా, ఇటు ఆరోగ్యానికి కూడా ఉపకరిస్తాయి. వైకుంఠ ఏకాదశి రోజున చిత్తశుద్ధితో ఉపవాసం, జాగరణ, పూజాదికారాలు జరిపితే.. ఆ ఏడాదంతా మనశ్శాంతిగా, సమస్యలు లేకుండా, ఆరోగ్యంగా, ఆనందంగా బతుకుతారని ఆధ్యాత్మిక వాదులు విశ్వసిస్తారు. మహావిష్ణువుకు నివాసమైన వైకుంఠమంటే సాక్షాత్తూ స్వర్గమేనని, అయితే ఈ స్వర్గం మరణించిన తర్వాత కాకుండా భూలోకంలో జీవించి ఉండగానే అనుభవించే స్వర్గమని పురాణాలు చెబుతాయి.