కన్నెగంటి బ్రహ్మానందం ప్రఖ్యాత తెలుగు హాస్య నటుడు. వివిధ భాషలలో 1250కి పైగా సినిమాలలో నటించి 2010 లో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాడు. 2009లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది. ఉత్తమ హాస్య నటుడిగా ఐదు నంది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం, ఆరు సినీ మా అవార్డులు, మూడు సైమా పురస్కారాలు అందుకున్నారు.
2005 లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేటు ప్రదానం చేసింది.కన్నెగంటి బ్రహ్మానందం రాజేంద్రప్రసాద్ కథానాయకుడిగా నటించిన ఆహనా పెళ్ళంట సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేశాడు. బ్రహ్మానందాన్ని మొట్టమొదటి సారిగా మూవీ కెమెరా ముందు మేకప్ వేసి నిలబెట్టినవ్యక్తి దర్శకుడు వేజళ్ల సత్యనారాయణ. నరేశ్ కథానాయకుడిగా నటించిన శ్రీ తాతావతారం అనే చిత్రంలో కథానాయకుడి నలుగురు స్నేహితులలో ఒకడిగా నటించాడు.
విశేషం ఏమిటంటే తన పుట్టినరోజు ఫిబ్రవరి 1 వ తేదీన ఆ సినిమాలో తొలి వేషం వేశాడు. 1985లో హైదరాబాద్ వెస్లీ కాలేజీలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు హీరో నరేశ్‌తో తీసిన తొలి షాట్ బ్రహ్మానందం నటజీవితానికి శ్రీకారం చుట్టింది. ఈ చిత్రంతో నటించడం ప్రారంభించినా, తొలిసారి విడుదలయిన చిత్రం మాత్రం జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన అహ! నా పెళ్ళంట!.