కేసీఆర్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులంతా హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. కేటీఆర్ కుటుంబంతోపాటు హరీష్‌రావు కూడా రాత్రే యశోదాకి వెళ్లారు. తెల్లవారుజాము వరకూ అక్కడే ఉన్నారు. వైద్యులతో మాట్లాడిన తర్వాత.. కాసేపట్లో చేయబోయే వైద్య పరీక్షలపై డాక్టర్లు క్లారిటీ ఇచ్చాక ఇంటికి వెళ్లారు. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు స్వల్ప ప్రమాదం జరిగింది.
తన వ్యవసాయ క్షేత్రంలోని నివాసంలో ఆయన కాలు జారి కింద పడ్డారు. గురువారం అర్థరాత్రి ఇది జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆయన ఎముక విరిగిందని వైద్యులు గుర్తించారు. అంతే కాకుండా, ఈ ప్రమాదంతో గతంలో విరిగిన కాలు గాయం మరోసారి తిరగబడిందని వైద్యులు తెలిపారు. వెంటనే ఆయనను యశోదా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రస్తుతం చికిత్స అందుతున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల్లో ఆయన నాయకత్వంలోని భారత్ రాష్ట్ర సమితి పార్టీ ఓటమితో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, ఎర్రవల్లిలోని తన ఫాం హౌజ్ కి వెళ్లిపోయారు. ప్రభుత్వ వాహనాలు వదిలేసి, ఎలాంటి ఆర్భాటం లేకుండా తన సొంత కారులో వెళ్లారు. గత మూడు రోజులుగా ఆయన ప్రజలను కలుస్తున్నారు. ప్రజలు పెద్ద ఎత్తున ఎర్రవల్లిలోని ఫాం హౌజ్ కి వచ్చి కేసీఆర్ ని కలుస్తున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా క్యూ కడుతున్నారు.