బర్రెలక్క..అసలు పేరు శిరీష. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామం ఆమె స్థలం. శిరీష్ తండ్రి చాలా రోజుల క్రితం కుటంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. చదువుకుంటూనే తల్లికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు శిరీష. అయితే ఓ సామాన్య నిరుద్యోగి ఎన్నికల బరిలో నిలబడితే ఎందుకంత భయపడుతున్నారని ప్రధాన పార్టీల అభ్యర్థులను శిరీష నిలదీశారు.
పోటీ నుంచి తప్పుకోకుంటే చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని, పొలిటికల్ పార్టీల లీడర్లు ఎందుకంత భయపడుతున్నారని ప్రశ్నించారు. ఎలక్షన్ల ముందు కుక్కకు బొక్క వేసినట్లు ఆశ చూపించడం కాకుండా రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల వివరాలను వెల్లడించాలని శిరీష డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ వేసి, పారదర్శకంగా నియామకాలు జరపాలని, ఇదే తన మేనిఫెస్టో అని చెప్పారు.
నామినేషన్ వేసినప్పటి నుంచి వేధింపులు మరింత పెరిగాయని తెలిపారు. ఫోన్లలో బెదిరింపులు, బూతులతో తిడుతున్నారు.. వారందరి వివరాలు జాగ్రత్త చేస్తున్నానని శిరీష చెప్పారు. ఎన్నికల తర్వాత వారి వివరాలు మీడియాకు వెల్లడిస్తానని శిరీష పేర్కొన్నారు.