అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నం లేనిది ఏ ప్రాణి జీవించలేదు. అన్నం ఎటువంటి లోటు లేకుండా దొరకడం అంటే సాక్షాత్తు ఆ కాశీ అన్నపూర్ణ అమ్మవారి అనుగ్రహం తప్పనిసరి కావాలి. ఆ అమ్మను నిత్యం కొలిచేవారికి అన్నపానాదులకు ఎటువంటి లోటు ఉండదు. ప్రతి నిత్యం భోజనం చేసేటప్పుడు ఆ అమ్మను కృతజ్ఞత పూర్వకంగా ధ్యానం చేసుకుని విశ్వంలో మనతోపాటు ఉండే అనేకానేక జీవులకు
బలిభుక్కులు సమర్పించి భోజనం చేసినవారికి, అతిథి అభ్యాగతి సేవ, ఆపన్నులకు, ఆకలితో బాధపడేవారికి అన్నప్రసాదాన్ని అందించే వారికి ఆ తల్లి అనుగ్రహం ఉంటుందని శాస్త్ర ప్రవచనం. అన్నదానం కోటి గోవుల దాన ఫలితంతో సమానమైనది. ఏది లోపించినా బ్రతకగలం. కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం. “దానాలన్నింటిలోకెల్లా అన్నదానం మిన్న” అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని పెద్దలు చెప్తారు. మనిషి ఆశకు అంతులేదు… అదుపు అంతకన్నా ఉండదు, ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా… ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది.
కానీ అన్నదానంలో మాత్రం దానం తీసుకున్నవారు ఇంక చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు. ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్నవారిని మనం సంతృప్తిపరచలేకపోవచ్చు కాని అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్నవారిని పూర్తిగా సంతృప్తి పరచవచ్చును. అన్నదానాన్ని ఒక యజ్ఞంలా భావించి చేసేవారు కూడా ఉన్నారు. ఆకలిగొని ఉన్నవారికి అన్నదానం చేయలేకయినా అన్నం పెట్టే ఇంటినైనా చూపించమని పెద్దలు చెప్తారు.