మేడ్చల్ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన మంత్రి మల్లారెడ్డి.. ఆకర్షణీయమైన ప్రసంగం చేశారు. అయితే.. అందులో వచ్చేది కారు.. ఏలేది కాదు.. అతడే మన కేసీఆర్.. అంటూ ప్రాసలతో చేసిన ప్రసంగాన్ని విని గులాబీ బాస్ ముఖంలో నవ్వులు విరబూశాయి. అటు.. ప్రజల నుంచి కూడా అంతే స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో.. ఆ డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
దీంతో.. మల్లన్న మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చినట్టే అన్నమాట. ఇదిలా ఉంటే.. మంత్రి మల్లారెడ్డిపై గులాబీ బాస్ కేసీర్ ప్రశంసలు కురిపించారు. మేడ్చల్ నియోజకవర్గ ప్రజల కష్టాలను మల్లారెడ్డి అర్థం చేసుకుంటారని చెప్పుకొచ్చారు. మల్లారెడ్డి మంచి మనిషి అని.. ఆయనకు భగవంతుడు సంపద ఇచ్చాడని తెలిపారు. నియోజకవర్గంలోని గ్రామాలను సొంత డబ్బుతో అభివృద్ధి చేశారని వివరించారు.
మల్లారెడ్డి లాంటి మనిషి ఉంటే నియోజకవర్గంలో ఉన్న 6 లక్షల మనషులను మోయగలుగుతారంటూ ప్రశంసలు కురిపించారు. మల్లారెడ్డి చేసిన సేవను గుర్తించాలన్నారు. మల్లారెడ్డి కష్టపడి పైకొచ్చారని… కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి అని పేర్కొన్నారు. రాజకీయ అనుభవంతో పాటు ఎంతో సింపుల్‌గా ఉండే మల్లారెడ్డిని భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు కేసీఆర్.