ఏపీ రాజకీయాల్లో ఆమె ఓ ఫైర్ బ్రాండ్. తనకంటూ ఓ ఇమేజ్ తో దూసుకుపోతున్న ఎమ్మెల్యే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం కీలక నేత రోజా సెల్వమణి. ఎన్నికల ప్రచారం ముందు వరకు అధికార పార్టీ పైన తనదైన శైలిలో విరుచుకుపడిన రోజా ఎన్నికల అనంతరం సైలెంట్ అయిపోయారు. అయితే తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలుగు దేశం పార్టీ (టీడీపీ) నేత బండారు సత్యనారాయణపై మరోసారి ఏపీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి ఫైర్ అయ్యారు.
బండారు లాంటి చీడ పురుగుల్ని ఏరిపారేయాల్సిన అవసరం ఉందన్నారు. మహిళను ఒక మాట అనాలంటే భయపడే పరిస్థితి రావాలన్నారు. ఆ దిశగా చట్టాలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసే వారిని తక్షణమే రిమాండ్కు తరలించేలా చట్టాలు కఠినంగా ఉండాలన్నారు. బండారుపై న్యాయ పోరాటం చేస్తానన్న మంత్రి రోజా.. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు వెళ్తానని చెప్పారు. బండారుపై క్రిమినల్, సివిల్ పరువునష్టం దావాలు వేస్తానని రోజా తెలిపారు.
మంత్రి రోజాకు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బండారు సత్యనారాయణపై పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టు చేయడం తెలిసిందే. ఆ తర్వాత ఆయన బెయిల్పై విడుదలయ్యారు. మంత్రి రోజాపై బండారు వ్యాఖ్యలను సినీ ఇండస్ట్రీకి చెందిన నటీమణులు తీవ్రంగా ఖండించారు. కుష్బూ, రాధిక శరత్ కుమార్, రమ్యకృష్ణ, మీనా, నవనీత్ కౌర్, నటి కవిత తదితరులు మంత్రి రోజాకు బాసటా నిలుస్తున్నట్లు ప్రకటించారు. రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండారు బేషరతు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయనపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.