దివంగత నటుడు అల్లు రామలింగయ్య టాలీవుడ్ లో గొప్ప హాస్యనటుల్లో ఒకరు. ఆయన మన మధ్య ఉన్నా లేకపోయినా నటుడిగా హృదయాల్లో నిలిచి ఉన్నారు. సినిమాల్లో ఆయన నటన.. మాట విరుపు.. హాస్య చతురత.. బాడీ లాంగ్వేజ్ రూపంలో ఎప్పుడూ జ్ఞాపకాల్లో నిలిచిపోయారు. అయితే లెజెండరీ నటులు, పద్మశ్రీ డాక్టర్ అల్లు రామలింగయ్య 101వ జయంతిని పురస్కరించుకొని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. జూబ్లీహిల్స్ లోని అల్లు బిజినెస్ పార్క్ లో ఈ కాంస్య విగ్రహ ఆవిష్కరణ జరగడం విశేషం. దానికి తోడు మనవడు అయాన్ చేతుల మీదుగా ఈ విగ్రహావిష్కరణ జరగడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్, చిరంజీవి సతీమణి సురేఖ, అల్లు శిరీష్, అల్లు అర్జున్ కూతురు అర్హతతో పాటు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహానికి పూలమాలవేసి ఆయన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. గత ఏడాది అల్లు రామలింగయ్య శతజయంతిని పురస్కరించుకుని అల్లు స్టూడియోని ప్రారంభించిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అల్లు స్టూడియోస్ ప్రారంభమైంది. ఇక ఇప్పుడు అల్లు బిజినెస్ పార్క్ లో ఆయన కాంస్య విగ్రహావిష్కరణ చేయడం విశేషం.